Posts Tagged teaching kids

చందమామ రాకే!!

చందమామ రాకే
అమ్మమ్మ వూరు కనుమరుగు
బాల్య జ్ఞాపకాలు మాయం
ఎండాకాలంలోనూ చదువులు
ఆవిరవుతున్న వేసవి సెలవులు
పసితనంపై తీవ్రమైన ఒత్తిడి
మానసిక నిపుణుల విశ్లేషణ

పిల్ల కాలువల్లో స్నానాలు చేయడం… ఎండిన పొలాల్లో ఆటపాటలాడడం… అమ్మమ్మ తాతయ్యల వద్ద గారాలు పోవడం… రాత్రికి పేదరాశి పెద్దమ్మ కథలు చెబుతుంటే వింటూ నిద్రలోకి జారుకోవడం… ఇవన్నీ ఒకప్పుడు చిన్నారుల వేసవి సెలవుల జ్ఞాపకాలు. ఇదంతా గతం. ఇప్పుడు కోచింగుల వేడిలో పిల్లకాలువలు ఎండిపోయాయి. వీడియోగేములతో కోతికొమ్మచ్చి ఓడిపోయింది. పిల్లలకు తీరికలేని వేసవి సెలవుల్లో పేదరాశి పెద్దమ్మే ఇంటికెళ్లిపోయింది. ఆమె కథలు కంచికెళ్లిపోయాయి. ఇక చందమామ మీద నల్లమచ్చ గురించి చెప్పేదెవరు? వినేదెవరు?

పసిపిల్లల బాల్య జ్ఞాపకాలకు పెద్ద ప్రమాదమే వచ్చిపడింది. ఏటికేడాది వేసవులొస్తున్నా పిల్లలకు సెలవులు మాత్రం రావట్లేదు. ప్రత్యేక శిక్షణలు, కోచింగులు వారి సమయాన్ని తినేస్తున్నాయి. అందమైన బాల్యాన్ని కఠినం చేస్తున్నాయి. ఉరకలు వేసే ఉత్సాహం, అలసట తెలియని ఆటపాటలు, హద్దుల్లేని ఆనందం నిండిన వారి సొంత సామ్రాజ్యాన్ని దురాక్రమిస్తున్నాయి. గతంలో పాఠశాలలకు సెలవులివ్వగానే పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి అమ్మమ్మ వూళ్లోనో, నాన్నమ్మ వూళ్లోనో వాలిపోయేవాళ్లు. బంధువుల సందడి… చుట్టుపక్కల పిల్లలతో సరదాలు… పెద్దవాళ్లతో ముద్దుమాటలు… చిరుతిళ్లు… తిరుగుళ్లతో నెలన్నర ఉత్సాహంగా గడిచిపోయేది. తల్లిదండ్రుల ఆంక్షలు లేకపోవడంతో పిల్లలు ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా కాలం గడిపేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. పిల్లలకు కాలపరీక్షలు మొదలయ్యాయి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, జీవనోపాధి కోసం పట్టణాలకు పరుగు, పోటీ ప్రపంచం… వంటివి బాల్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. చదువులు, ఆటపాటల్లో పిల్లలు ముందుండాలన్న ఆలోచనతో వారి ఆసక్తిని పట్టించుకోకుండా వేసవిలోనూ లేనిపోని శిక్షణలిప్పించడం వారి అందమైన ప్రపంచానికి ఎసరు పెడుతోందంటున్నారు. ఆర్థిక వెసులుబాటు కోసం భార్యాభర్తలు ఉద్యోగం చేస్తుండడం, ఇద్దరికీ ఒకేసారి సెలవులు దొరకడం కష్టం కావడం వంటి కారణాలు కూడా ఉన్నాయి.అమ్మా, నాన్నా ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుంటారు. ఆదివారం తప్ప మిగతా రోజుల్లో బయటకు వెళ్లడం కుదరదు. వేసవి సెలవులు మొత్తం అమ్మమ్మ, తాతయ్యల వూళ్లలో గడపడం కష్టమేఅని శ్రీకాకుళానికి చెందిన ఐదో తరగతి విద్యార్థి రాహుల్‌ చెప్పాడు.

వేసవికాలం చదువులు
ప్రపంచీకరణ నేపథ్యంలో పోటీతత్వానికి అనుగుణంగా పిల్లలకు తీర్చిదిద్దడానికి తర్వాతి తరగతుల కోసం వేసవిలోనే పలువురు తల్లిదండ్రులు ట్యూషన్లు చెప్పిస్తున్నారు. తరగతిలో మొదటిస్థానంలో ఉండాలంటే ఈ మాత్రం కష్టం తప్పదని వారు అంటున్నారు. ఇప్పుడు చిన్నారుల వార్షిక పరీక్షలు పదిహేను, ఇరవై రోజుల పాటు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల మధ్య పోటీ వారికి భారంగా పరిణమిస్తోంది. దీంతో ఏటికేడాది పరీక్షలు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్‌లో పరీక్షల గండం గడిచిందని పిల్లలు ఊపిరి పీల్చుకోకముందే వేసవి శిక్షణలు ప్రారంభిస్తున్నారు. తమ స్కూలు నుంచి విద్యార్థి జారిపోకూడదన్న ఆలోచనతో చాలా ప్రైవేటు యాజమాన్యాలు చిత్రలేఖనం, ఆంగ్లం వంటివాటిలో వేసవి శిక్షణ పేరుతో ముందే ఫీజులు కట్టించుకుంటున్నాయి. కొన్నిచోట్ల క్రీడలు నేర్పిస్తున్నా పిల్లల ఆసక్తిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీంతో వారు ఇష్టమున్నా లేకున్నా భారంగా పాఠశాలలకు వెళుతున్నారు. ఈ పరిస్థితి వేసవిలో ఉల్లాసాన్నిచ్చే అమ్మమ్మ, తాతయ్యల ఊళ్లకు పిల్లలను దూరం చేస్తోంది. పట్టణాలు, నగరాల్లో ఇరుకు జీవితాన్ని పక్కనబెట్టి కొంతకాలం పాటు పచ్చని పల్లెల్లో సేదదీరడం స్వప్నంలా మారడం బాధాకరమే కాదు అనారోగ్యకరమని మానసిక నిపుణులు చెబుతున్నారు. వేసవిలోనూ పాఠశాలలు నడపడం సరికాదు. ఇది అత్యంత ప్రమాదకర పోకడ. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే భావితరం ఎంతో నష్టపోతుంది. వేసవి అంటే చిన్నారులకు ఆదివారంలాంటిది. వారు ఆ కొంతకాలమైనా హుషారుగా గడపకుంటే తదుపరి తరగతుల్లో ఆసక్తిగా చదవలేరు. ఏడాది మొత్తం చదివే చిన్నారి క్రమంగా ఏకాగ్రత కోల్పోయే ప్రమాదముంది. తద్వారా దీర్ఘకాలంలో చదువుల్లో వెనుకబడొచ్చు. మే అంటే విరామం. ఆ మాసంలో చదువు పక్కన పెట్టేయాలి. ఇక వేసవి శిక్షణలు కూడా అందరికీ ఉపకరించవు. చిన్నారుల ఆసక్తిని పరిగణనలోకి తీసుకోకుండా క్రీడల్లో తర్ఫీదునిచ్చినా దాన్నో భారంగానే భావించే ప్రమాదముంది. ముఖ్యంగా ఆంగ్లం, పెయింటింగుల్లో శిక్షణ అంటూ వారిపై ఒత్తిడి తీసుకొస్తే చదువంటేనే ఏవగింపు కలిగే ప్రమాదముంది. దీంతో మానసిక ఇబ్బందులు ఎదురవుతాయి. స్కూలు ఫోబియా పెరిగొచ్చు. ఏడో తరగతి, ఆపై తరగతుల పిల్లలైతే ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదముంది. ఇలాంటి పరిణామాలు నేర ప్రవృత్తికి దారితీస్తాయి. ఇది ఆత్మహత్యా సదృశ్యమేఅని మానసిక నిపుణుడు రోష్‌ మల్లిఖార్జున్‌ హెచ్చరించారు.

ఈ-తరానికీ కోచింగ్‌ వడదెబ్బ
పదోతరగతి లోపు పసిపిల్లలే కాదు… యవ్వనంలోకి అడుగుపెట్టిన నవతరం యువకులూ వేసవి కాలం సరదాలకు దూరమవుతున్నారు. కళాశాలలకు సెలవులిచ్చిన వెంటనే కోచింగ్‌ల పేరుతో పట్టణాలు, నగరాల బాట పడుతున్నారు. సొంత ఊరికి, ఇంటికి దూరంగా ఇరుగు గదుల్లో పుస్తకాలతో కుస్తీపడుతున్నారు.ఏం చేస్తాం. తప్పదు మరి. ప్రవేశపరీక్షలో ర్యాంకు సాధించాలంటే వేసవిలో కూడా కుస్తీ తప్పదు. లేకపోతే వెనకబడిపోతాంఅని విజయవాడలో కోచింగ్‌ తీసుకుంటున్న శ్రీకాకుళానికి చెందిన రవి చెప్పాడు. ఇలాంటి విద్యార్థులు ఏటా లక్షల్లో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, హైదారాబాద్‌లకు ప్రయాణం కడుతున్నారు. ఇక్కడా తల్లిదండ్రుల ఆకాంక్షలే వారిని ఒత్తిడికి గురిచేస్తున్నాయి.కావాల్సిన పుస్తకాలన్నీ ఉన్నాయి. ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటానని మా వాళ్లకు చెప్పాను. అయినా వినలేదు. మా ఇంటి పక్కనే ఉంటున్న శరత్‌ కోచింగ్‌కు వెళ్లాడని నన్ను కూడా పంపారు. చిన్నప్పటి నుంచి నాకు ఒంటరితనమంటే భయం. ఇక్కడ హోటల్‌లో భోజనం బాగాలేదు. ర్యాంకు మాట దేవుడెరుగు. ఈ కోచింగ్‌ ముగిసేలోగా నాకు రోగం గ్యారంటీఅని విజయనగరానికి చెందిన కృష్ణ మనసువిప్పాడు. ఉన్నతంగా స్థిరపడడానికి కష్టపడడం అవసరమే అయినా పిల్లలు మానసికంగా, శారీరకంగా దెబ్బతినే స్థాయిలో ఉండకూడదన్న విషయాన్ని కొందరు తల్లిదండ్రులు ఆలోచించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు మాత్రం మానసిక ఉల్లాసం అవసరాన్ని, జ్ఞాపకాల తీయ్యదనాన్ని మరిచిపోలేదు. అన్ని ప్రవేశపరీక్షలు ముగిసిన తర్వాత పిల్లలతో మా సొంతూరు వెళ్తాం. అక్కడ మనుషుల ఆప్యాయతలు, ఆ మట్టివాసన మర్చిపోగలనా? బంధువులందరి ఇళ్లకు వెళ్లి యోగక్షేమాలు తెలుసుకుంటా. ఇంతకంటే ఆనందం ఏముంది చెప్పండీఅని వివరించారు విజయవాడలో ఉండే జానకిశ్రీరాం (తూర్పుగోదావరి).

(article 23nd April ఈనాడు పేపర్లో వచ్చింది)

——————–

ఈ ఆర్టికల్ చదువుతుంటే, నా చిన్నతనంలో ఆడుకున్న ఆటలన్నీ (గోళీలాట,జిల్ల-కోడి,బెండ్లు కట్టుకొని ఈత నేర్చుకోవడం వగైర వగైర..) గుర్తొచ్చాయి.

అలానే బాధ కూడా వేసింది. కాంపిటిషన్ పేరుతొ పిల్లల్ని ఎంత బాధ పెడుతున్నారు ఈకాలం తల్లిదండ్రులు. మన పిల్లలు చదువులో ఎలా వున్నారు పిల్లలు చదువులో ఎలా వున్నారు, వారి మనస్తత్వం ఎంటి లాంటివి గమనించుకోవడం, వాటికి అనుగుణంగా నడుచుకోవడం, పిల్లలకు ఏది ఒప్పు, ఏది తప్పు చెప్పించడం తల్లిదండ్రులదే బాధ్యత. అలాంటిది ఆ తల్లిదండ్రులే పక్కింటి పిల్ల వాళ్ళతో పోల్చి

వారి పిల్లలకి చెప్పించడం చాలా చాలా పెద్ద పొరపాటు. పక్కింటి పిల్లాడు అలాచేసాడు, నువ్వు కూడా అలా చెయ్ అని గుడ్డిగా చెప్పడం / చేయడం పెద్ద పొరపాటు.

పిల్లల స్థోమత (ఉదాహరణకి బాగా చదవడం) వేరుగా వేరుగా ఉంటుంది. వారి వారి పిల్లల స్థోమతని గమనించి, స్థొమతని ఎలా పెంచుకోవాలో / వ్రుద్ధి చెందాలో చెప్పించాలి. చెప్పిన ప్రకారం చేసాక / వ్రుద్ధి చెందాక, పిల్లల్ని కూర్చొపెట్టుకొని వారికి అర్థం అయ్యేలా వాళ్ళు ఎలా వ్రుద్ధి చెందారో వివరించాలి. ఇలా చేయడానికి చాలా ఓపిక ఉండాలి. ఇది చదువులోనే కాదు ఆటల్లో, ప్రవర్థనలో కూడా ఇలానే చేయవచ్చు.

లీవుల టైంలో కూడా చదువుకోమనడం ఎలా ఉంటుందంటే, గొడ్డలి పొదును పెట్టకుండా చెట్లు నరుక్కుంటూ పోతే ఎంత బలముండి ఏం ప్రయోజనం? పిల్లలు బాల్యాన్ని మనం ఎంజొయ్ చెసినట్టు వాళ్ళనూ చేయనిద్దాం.

Comments (1)